రాఖీ పండగ.. ఆత్మీయతకు ప్రతీక.
అన్న చెల్లెలు అనుబంధానికి... అనురాగానికి... రక్షబంధన్ ప్రతీక. అన్నకు చెల్లెలు రాఖీ కట్టి.. చల్లగా ఉండాలని కోరుకుంటే.. చెల్లెలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని అన్నయ్య అశీర్వదీస్తాడు. రక్తసంబంధాన్ని రక్షబంధన్ తో గుర్తుచేసుకునే ఆత్మీయ క్షణాలు. అదే మన తెలంగాణల రాఖీల పండుగ.అన్నా చెల్లెళ్ల అనుబంధమై.. అనుభూతుల స్మృతియై.. అనురాగాల వెల్లువై మదిని మీటు సంబరం రాఖీ పౌర్ణమి.. రక్షాబంధన్. పేరేదైనా పెల్లుబికే ఆనందం ఒక్కటే. ప్రేమానుబంధాల పల్లకిలో నీకిదే సుస్వాగతం అంటూ అక్కాచెల్లెళ్లు ఆహ్వానించే రోజు ఇవాళ.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికిది ప్రత్యేకమైన పండుగ రోజు.
ప్రతి గడపలో ఎదురు చూపు... ప్రతి మనసులో మైమరుపు... చెల్లి వస్తుందన్న ఆనందంతో.. అన్న మనసు పులకరిస్తది. తమ్ముడిని చూస్తానన్నసంతోషంతో అక్క మనసు పరవశిస్తది. తియ్యని పిండివంటలు అన్నకు..తమ్ముడికి పెట్టి చెళ్లెలు..అక్క తమ ఆత్మయతను అందిస్తే.. నిండు నూరేల్లు చల్లగా ఉండాలని అన్నలు అశీర్వాదిస్తాడు.అన్నా అన్న పిలుపులో ఎంత ఆనందముంటుందో.. అక్కా అన్న పలకరింపులో అంతటి అనురాగం ప్రతిధ్వనిస్తది. అనుభవించే కొద్దీ అలరించే అనుభూతుల అనుబంధాలివి. ఎన్నడూ తరగనివీ, ఎప్పటికీ మరువనివీ, ఏనాటికీ తనివి తీరనివీ, ఆత్మీయతానురాగాల మానవ సంబంధాలివి. ఎప్పుడూ ఉండేవే అయినా...అప్పుడప్పుడూ వాటి ప్రత్యేకతని లోకానికి చాటిచెప్పేందుకు, మరోసారి గుర్తు చేసుకునేందుకూ కొన్ని పర్వదినాలు వెలిసినయి. అలాంటి వాటిలో మేటిది ఈ రక్షాబంధన్.అన్నా చెల్లెల్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీపౌర్ణమి. గోరింటాకుతో ఎర్రగా పండిన చిన్నిచేతుల మునివేళ్లతో అన్నా తమ్ముళ్ల ముంజేతులకు రాఖీ కట్టి నోరుతీపి చేసి నాకేమి ఇస్తావంటూ అమాయకంగా అడుగుతది చెల్లెలు. అమ్మలోని ఆప్యాయతను.. నాన్నలోని భాధ్యతను అందిపుచుకున్న అన్న చెల్లెను ప్రాణంగా చూసుకుంటడు. చెల్లె ఆశల్ని అన్న ఆరోప్రాణంగా భావిస్తాడు. చెల్లె కోరిందే తడవుగ సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సిద్దమైతడు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి సెటిలైన వాళ్లు పండగల్ని తమ సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటరు... అది కృష్ణాష్టమి అయినా విజయదశమి అయినా. ఇక రక్షా బంధన్ అయితే... వారి కల్చర్ మరింత కలర్‌ఫుల్‌గా కనిపిస్తది.రాఖీ పండగను మనం ఒక విధంగా సెలబ్రేట్ చేసుకుంటే, సింధీస్ మరో విధంగా జరుపుకుంటరు. ఇక జైనుల ఆనవాయితీయే వేరు. సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ... అన్నతో పాటు వదినలకు కూడా రాఖీ కట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తరు. ఈ రాఖీ ద్వారా అన్న తమను అన్ని కష్టాల నుండి రక్షించాలని కోరుకుంటరు. ఇక అన్నదమ్ములైతే... ప్రతీ విషయంలోనూ అండగా ఉంటమని, వారికి వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసా ఇస్తరు. ఎలా జరుపుకున్నా పండగ పండగే... సంప్రదాయాలు వేరైనా అన్నా చెల్లెళ్ల అనుబంధం ఒక్కటే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి