తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

16 జూన్, 2011

మా భూమి

"మాభూమి" ఒక అద్భుతం ..


మా భూమి సినిమాకు ముప్పయ్యేళ్లు నిండాయి. అన్ని సినిమాల్లాగే మా భూమినీ చూస్తే.. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తెలుగు సినిమాల్లో దేనికీ లేని ప్రత్యేకత ఈ సినిమాకు ఉంది. అందుకే.. మూడు దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ అందరికీ గుర్తుకు వస్తుంది. ఇంతకీ.. మాభూమి గొప్పదనం ఏమిటి? ఇప్పుడు కూడా చర్చించుకోవడానికి కారణం ఏమిటి?
సినిమా అంటే.. ఇమేజ్ ఉన్న హీరో ఉండాలి. ఒంపుసొంపులు చూపించే హీరోయిన్ ఉండాలి. హీరో ఇమేజ్‌ను చాటిచెప్పడానికి నాలుగు ఫైట్లు.. ఆరు పాటలు.. ఓ వంద డైలాగ్‌లు ఉండాలి. ఇదీ 1980 నాటికి తెలుగు సినిమా పరిస్థితి. కానీ.. ఈ సమయంలో విడుదలైన మాభూమి సినిమాలో మాత్రం.. మనకు ఇవేవీ కనిపించవు. పేరున్న హీరోహీరోయిన్లు లేరు... హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన లేదు. జ్యోతిలక్ష్మి ఐటెం సాంగులూ లేవు.. కానీ.. అంతకుమించి.. హృదయాలను కదలించే కథ ఉంది. అదే ఈ సినిమా విజయానికి తొలిమెట్టయ్యింది.
మాభూమి సినిమాలో గుండెల్ని పిండే సామాజిక అంశం ఉంది. నిజాంనవాబు దురాగతాలకు బలైన సామాన్యుడి ఇతివృత్తముంది. కడుపు మండి భూస్వాములపై తిరగబడ్డ సామాన్యుడి గుండెధైర్యం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే 1930 నుంచి 1948 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానంలోని సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది మా భూమి సినిమా. తెలంగాణ ప్రాంతాల్లో దొరల ఆగడాలు.. వారికి వెట్టిబానిసలుగా పనిచేసే బడుగుజీవుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించింది మాభూమి.
పెత్తందారీ పోకడలను ఎదిరిస్తూ.. భూమికోసం మొదలైన సాయుధ పోరాటమే ఈ మాభూమి సినిమా. నిజాం పాలన కనుమరుగై.. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనమైనా.. మారని పరిస్థితులను ఇందులో ఎత్తిచూపించారు దర్శకనిర్మాతలు. రాచరిక పాలనలో భూస్వాములుగా చలామణీ అయినవారే.. ప్రజాస్వామ్యదేశంలో పాలకులుగా అవతరించడాన్ని.. వెట్టిచాకిరీ వ్యవస్థను.. బాలకార్మిక వ్యవస్థనూ.. ఈ సినిమా ప్రశ్నిస్తుంది. దొరల దౌర్జన్యాలను ఎదురించడానికి సామాన్యుడు చేసిన పోరాటాన్ని తెరపై మనకు చూపిస్తుంది.

పైగా తెలుగు వెండితెర రంగులు అద్దుకుంటున్న కాలమది. అన్ని సినిమాలు పూర్తిగా కలర్‌తీస్తున్నారు. ఓ వైపు రాఘవేంద్రరావు.. మరోవైపు.. దాసరినారాయణరావు వరస కమర్షియల్ హిట్స్‌తో సంచలనాలు సృష్టిస్తున్నారు. సరిగ్గా ఆసమయంలో పూర్తిగా బ్లాక్‌అండ్ వైట్‌లో పేరుప్రఖ్యాతులు లేని ఆర్టిస్టులతో విడుదలయ్యింది మాభూమి సినిమా. బడ్జెట్‌తో పాటు.. ఆనాటి పరిస్థితులకు అద్దంపట్టేలా తీయాలంటే బ్లాక్‌అండ్ వైటే మేలనుకున్న నిర్మాత నర్సింగరావు ఆవైపే మొగ్గు చూపారు.

తెలంగాణ రైతులు చేసిన సాయుధపోరాటాన్ని కళ్లకు కట్టి చూపిస్తుంది మా భూమి సినిమా. కమర్షియల్ ఫార్ములాలోకి తెలుగు సినిమా వెళ్లిపోతున్న తరుణంలో వచ్చి.. సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా.. ఈ సినిమాలోని సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. పదేపదే పాడుకోవాలనిపించే శక్తి మా భూమి పాటలది..
పల్లెటూరి పిల్లగాడా అన్న ఒక్క పాట ఎంతో పెద్ద కథను చెబుతుంది. నిజాం సంస్థానంలో పేదవారి జీవితానికి అద్దం పడుతుంది. పదేళ్లు కూడా నిండకుండానే.. భూస్వాముల దగ్గర జీతగాళ్లుగా మారిపోయే పసిపిల్లల వేదనను తట్టి చూపిస్తుంది. సుద్దాల హన్మంతు రాసిన ఈ పాట.. అప్పట్లో పెద్ద హిట్. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ ఈ పాట మళ్లీ మళ్లీ పాడుకోవాలనిపిస్తుంది. వినేకొద్దీ వినాలనిపిస్తుంది. ఈ పాటతోనే సినిమా మొదలవుతుంది. పిల్లవాడిని విజవల్స్‌లో చూపించినా.. లేడీ వాయిస్‌తో ఈ పాట పాడించడం విశేషం. సినిమాలో ఈ పాటను సంధ్య పాడారు. ఆవేదన నిండిన గాత్రంతో ఈ పాట పాడి.. అందరి హృదయాలను కదిలించారు సంధ్య. ఈ పాటతో.. మాభూమి ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడమని ఎంతోమంది ఇప్పటికీ అడుగుతుంటారు.

పల్లెటూరి పాట ఎలా వచ్చింది?


పల్లెటూరి పిల్లవాడా పాట.. మాభూమి సినిమాకోసం రాసింది కాదు. సుద్దాల హన్మంతు వృత్తిరీత్యా వైద్యుడు. ఓ రోజు పక్కగ్రామానికి వెళుతుండగా.. మార్గమధ్యలో పశువులు కాసే ఓ పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడట. ఆ పిల్లవాడిని ఎంత అడిగినా ఏమీ చెప్పలేదట. చిరిగిన గోనెసంచి భుజం మీద పెట్టుకుని.. కాళ్లకు చెప్పులకు బదులు తాటిమట్టలు కట్టుకుని.. చిరిగిన బట్టలు వేసుకున్న ఆ పిల్లాడ్ని చూసి హన్మంతు కరిగిపోయారు. అంతే.. అక్కడే ఓ చెట్టు కింద కూర్చుని ఈ పాటను రాసేశారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. అందుకే.. ఈ పాటను సినిమాలో వాడుకున్నారు. అయితే... పాట వాడుకునే సమయానికి ఈ పాట రాసిందెవరో సినిమానిర్మాతలకు తెలియదు. అజ్ఞాత కవి అని చెప్పుకుంటున్న తరుణంలో సుద్దాల హన్మంతు కొడుకు.. గేయ రచయత సుద్దాల అశోక్‌తేజ నిర్మాత నర్సింగరావు కలిసి అసలు స్టోరీ చెప్పారు. దీంతో టైటిల్స్‌లో సుద్దాల హన్మంతు పేరును కూడా కలిపారు.

బండెనక బండి కట్టి...

మా భూమి సినిమాను వీలైనంతవరకూ.. జనానికి చేరువ చేయాలని భావించిన నిర్మాతలు... అప్పటికే ప్రజల్లో ప్రజాధారణ పొందిన పాటలను ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. పల్లెటూరి పిల్లవాడతో పాటు.. నైజం నిరంకుశత్వాన్ని ఎదిరించిన ప్రజాపాట.. బండెనకబండి కట్టి కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. నిజాం అంటే చాలు.. పల్లె ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో ఎంత ద్వేషం నిండుకొని ఉందో.. ఈ పాట చాటి చెబుతుంది. నిజాం దురాఘతాలను ఇక ఏమాత్రం సహించలేమంటూ తిరగబడ్డ జనాన్ని ఈ పాట ద్వారా ముందుకు నడిపించారు.. నల్గొండ జిల్లాకు చెందిన జి.యాదగిరి. తెలంగాణ ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పాటను.. మా భూమి సినిమాలో వాడారు. ఈ పాటను ప్రజాగాయకుడు గద్దర్ పాడడంతో పాటు.. సినిమాలో కూడా ఆయనే నటించారు.


నిర్మాతల గుండెధైర్యం


భూమికోసం హైదరాబాద్ సంస్థానంలో తుపాకులు చేతపట్టారు రైతన్నలు. ఇదే చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా గుర్తింపుపొందింది. అయితే.. ఈ వీరోచిత పోరాటాన్ని.. ఆనాటి పరిస్థితులను వివరిస్తూ.. ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఈ పోరాటాన్నే.. "జబ్ ఖేత్ జాగే" పేరుతో.. కిషన్ చందర్ ఉర్దూలో రచించారు. ఈ నవల ఆధారంగా చేసుకునే సినిమా తీయాలని బి.నర్సింగరావు నిర్ణయించుకున్నారు.
బెంగాలీ డైరెక్టర్ గౌతమ్‌ఘోష్‌ తీసిన ఓ డాక్యుమెంటరీ చూసిన నర్సింగరావు.. తన సినిమాకు ఆయన్నే డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. తన మిత్రుడుతో కలిసి సినిమా నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే.. అప్పటికే సాయుధపోరాటం జరిగి మూడు దశాబ్దాలు పూర్తయ్యింది. దీంతో... ఆనాటి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడానికే చాలా సమయం కేటాయించాల్సి వచ్చింది. సాయుధ పోరాటం జరిగిన గ్రామాలను దర్శిస్తూ.. పోరాటంలో పాల్గొన్న వారి అభిప్రాయలు తెలుసుకుంటూ.. ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.
ఈ సినిమాతో లాభాలు ఆర్జించాలన్న లక్ష్యం ముందునుంచి లేదు. దీంతో వీలైనంతవరకూ తక్కువ బడ్జెట్‌తోనే సినిమా తీయాలనుకున్నారు. స్టార్లకు బదులు.. కొత్త ఆర్టిస్టులను తీసుకొని.. సినిమా తెరకెక్కించారు. బహుశా ఆర్టిస్టులెవరినైనా తీసుకుని ఉంటే.. ఇంత అద్భుతంగా సినిమా వచ్చేది కాదేమో.. దాదాపు రెండేళ్ల ప్రయత్నం తర్వాత.. మాభూమి సినిమాగా జనం ముందుకు వచ్చింది. చిన్న సినిమాగానే భావించిన సినీపెద్దలకు.. సూపర్‌హిట్ అయ్యి షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో సంధ్య 35 ఎంఎంలో నూన్‌షో ఆటగా విడుదలైన మాభూమి సినిమా.. ఏడాదికి పైగా ఫుల్‌కలెక్షన్లతో ఆడి రికార్డు సృష్టిచింది.

ఇది తెలంగాణ భూమి పుత్రులందరు చూడాల్సిన సినిమా ... మీకు ఈ విషయం తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఆర్టికల్ ని మీకు పరిచయం చేస్తున్న.-- శ్రీపాద రమణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి