తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

16 జూన్, 2011

పోచమోని జంగయ్య 13వ వర్థంతి ఆగష్టు 23

తెలంగాణ సాయుధ పోరాట యోధులు పోచమోని జంగయ్య 13వ వర్థంతి

తెలంగాణ సాయుధ పోరాట యోధులు పోచమోని జంగయ్య పరమపధించి నేటికి 13 వసంతాలైంది. ఆయన వర్థంతి సభను వ్యకాస ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి కె.జగన్‌, మండల కార్యదర్శి కంబాలపల్లి భాస్కర్‌ తెలిపారు. ఈ ప్రాంతంలో దున్నెవానికే భూమి దక్కాలని, వెట్టి చాకిరి విముక్తి పొందాలని, జజాకార్ల రాచరిక పాలనకు చరమగీతం పాడాలని నిర్వహించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జంగయ్యది కీలకపాత్ర. దళపతిగా కామ్రేడ్‌ కృష్ణమూర్తి(రాగన్న)కు సహచరుడుగా పని చేశారు. నల్గొండ జిల్లాలో కలిసి ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఎర్రజెండాను పల్లెపల్లెకు తీసుకుపోయిన ధీరుడు జంగయ్య. సాయుధ పంథాను వదిలిన తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఇబ్రహీంపట్నం డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా పని చేశారు. 1981 నుండి 1988 మార్చి వరకు బండాలేమూర్‌ గ్రామ తొలి సర్పంచిగా పని చేశారు. అదే తరుణంలో అనేక భూపోరాటాలు నిర్వహించి పేదలకు వందల ఎకరాలను పంపిణీ చేశారు.

ఆరుట్ల భూ ఉద్యమంలో ఆయన పాత్ర అనిర్వచనీయం పటేల్‌, పట్వారీల ఆగడాలను ప్రత్యక్షంగా ఎదురొడ్డిన విప్లవీరుడు జంగయ్య. ఇటు జాపాలకు కర్రె కోటప్ప, ఆరుట్లకు శ్రీరాం వెంకటయ్య, రంగాపూర్‌కు కుకుడాల జంగారెడ్డిలు సర్పంచ్‌లుగా ఒకే కాలంలో పని చేశారు. సమితీలో ప్రజాసమస్యలపై వీరి వాగ్ధాటికి నాటి ప్రభుత్వం, అధికారుల్లో వణుకు పుట్టించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వారిది అందే వేసిన చేయి. శత్రువులకు ఎదురొడ్డి పేదలకు అండదండలై వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించారు. జాపాల, రంగాపూర్‌ ఫారెస్టు భూముల కోసం ఉద్యమించిన ఉత్తముడాయన. తాళ్లపల్లిగూడలోని 84 సర్వేనంబర్‌లో సుమారు 400 ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. లోయపల్లి శ్రీనివాసరావు దొర భూములను పేదలకు పంపిణీ చేశారు. నేడు ఆ భూములే గిరిజనులకు జీవనాధారంగా మారాయి. జంగ్లాత్‌ ఆమీన్‌ ఆగడాలను నిలువరించారు. బండాలేమూర్‌కు ఆర్టీసి బస్సు, విద్యుత్‌ వసతి తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కింది. వ్యవసాయ కార్మికుల కూలీ రేట్లపెంపుకు ఉద్యమించారు. పాలేర్ల జీతాలను నెలకు కుండెడు జొన్నలు, కుండెడు సజ్జలు పెంచాలని ఆయన సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించారు. ఆలాంటి మహాయోధుని 13వ వర్థంతి సభ నేడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఆ వర్థంతి సభకు తరలిరావాలని వ్యకాస నాయకులు పిలుపునిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి