తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

16 జూన్, 2011

కోటి లింగాల

కోటి నాణేల చరిత్ర’

- సదానంద్

కోటి నాణేల చరిత్ర’

- సదానంద్

దక్షిణ భారతదేశాన్ని (ఆంధ్రాతో సహా) నాలుగు వందల యాబై ఏళ్లపాటు నిరాటంకంగా పాలించిన శాతవాహనుల తొలి రాజధాని నగరమే ‘కోటిలింగాల’ ఆంధ్రుల మహోజ్వల చరిత్రకు బీజం పడింది ఇక్కడే. కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరు మండలంలో మారుమూలన విసిరేసినట్లుగా ఉండే గోదావరి తీర ప్రాంత గ్రామం కోటిలింగాల కరీంనగర్-రాయపట్నం రహదారిపై వెల్గటూరు నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. 1979-80 నుండి 1983-84 మధ్య నాలుగు సంవత్సరాల పాటు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో ఆంధ్రుల చరిత్రకు సంబంధించి అనేక సాక్ష్యాలు వెలుగు చూశాయి. ఆంధ్రుల చరిత్రకు, శాతవాహన రాజులకు విడదీయరాని బంధం ఉందనే విషయం ఇక్కడే వెలుగు చూసింది. తొలి శాతవాహనుల రాజధాని కోటిలింగాలలో వెలుగు చూడడంతో అప్పటి వరకు ప్రచారంలో ఉన్న చరిత్ర మొత్తం తారుమారైపోయింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆ మట్టికింది మహానగరం నేడు శ్రీపాద ముంపులో భాగంగా శాశ్వత జల సమాధిలోకి జారుకోబోతోంది. ఇది చరిత్ర ప్రేమికులకు నిజంగా దుర్వార్తే. నాలుగేళ్లపాటు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో సాగిన ఈ తవ్వకాల ఫలితంగా శాతవాహనుల పాలన కాలానికి సంబంధించి ఎన్నో భౌతిక సాక్ష్యాధారాలు లభించాయి. తవ్వకాలలో లభించిన సాక్ష్యాలకు సంబంధించి నివేదిక సుదీర్ఘకాలం పాటు వెలుగుకు నోచుకోలేకపోయినప్పటికీ 23 యేళ్ల తరువాత 2006లో దాన్ని బయటపెట్టారు. 2009లో మూడవసారి ఇక్కడ జరిపిన తవ్వకాల్లో లభ్యమైన బౌద్ధ చైత్యము, నాగశిల్పము, బుద్ధ విగ్రహాలు వంటి చారిత్రక ఆధారాలను బట్టి ఈ ప్రాంతం బౌద్ధమత కేంద్రంగా విలసిల్లినట్లు అర్థమవుతోంది. అదేవిధంగా ఇక్కడికి అతిసమీపంలోని మునులగుట్ట ప్రాంతంలో జైనులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. బౌద్ధము, జైనము, శైవములాంటి మూడు మతాచారాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఒకే చోట లభ్యం కావడం కోటిలింగాల ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. శాతవాహనులకు పూర్వమే ఈ ప్రాంతంలో నాగరిక సమాజం నెలకొని ఉందనేది చరిత్రకారుల భావన. 2000 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఇటుకలతో నిర్మించిన నీటి బావులు, నీటి సరఫరా కాలువలు, ఎంతో అందంగా మలచిన మట్టి పాత్రలు, కుండలు తదితర ఆధారాలను బట్టి నిర్ధారిస్తున్నారు. అంతేకాకుండా తవ్వకాలలో లభించిన ఆభరణాలు, నాణాలు, పూసలు వాటిని తయారు చేయడంలో కనబర్చిన నైపుణ్యం ఎంతో ఆశ్చర్యపర్చేవిగా ఉన్నాయి. ఇప్పటికి అక్కడ భూ ఉపరితలంపై శిథిలమైన చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కన్పిస్తాయి.
కోటిలింగాల చరిత్ర
=============
వౌర్య ,శృంగ,కాణ్వ వంశాలకు చెందిన సామ్రాజ్యాలు పతనమైన తరువాత దక్కన్‌లో క్రీస్తుపూర్వం 2 నుండి క్రీ.శకం 2 వరకు అనగా సుమారు 450 సంవత్సరాల పాటు 30మంది ఆంధ్రశాతవాహన వంశంకు చెందిన రాజులు పరిపాలించి, తెలుగు జాతి, భాషా, సాహితీ, సంస్కృతుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతేకాకుండా విశేష వారసత్వ సంపదను మనకు మిగల్చడం ద్వారా చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయారు. అయితే శాతవాహనులు రాజుల వివరాలు పురాణాలు, కొంత మేర శాసనాలు, శిల్పాలు, స్థూప నిర్మాణాలు, సాహిత్యం వల్ల లభ్యమవుతున్నా, చాలా వివరాలు అసంపూర్తిగానే మిగిలిపోయి వున్నాయి. మరింత లోతైన పరిశోధనల అవసరాన్ని, ఆవశ్యకతను ఈ ఆధారాలు నొక్కి చెబుతున్నాయి. హాలరాజు విరచిత గాథాసప్తశతి, గుణాడ్యుడి బృహత్క్థ, తదితర గ్రంథాలు వీరి కాలంలోనే వచ్చినవిగా చరిత్రకారుల అంచనా. శాతవాహనులు వైదికులమని చెప్పుకున్నప్పటికినీ, బౌద్దాన్ని ఆదరించారు. అనేక చైత్యాలు, స్థూపాలు, మఠాలు, ఆరామాల నిర్మాణాలకు ముందుకు వచ్చారు. ఇక్కడ 1979-84 మధ్య రెండు సార్లు జరిగిన తవ్వకాలలో తొలిశాతవాహన రాజైన శ్రీముఖుడికి చెందిన నాణాలేకాక, పూర్వ శాతవాహన రాజుల ఆనవాళ్ళు, కోటలు, నాలుగు దిక్కులా బురుజులు బయటపడ్డాయి. ఒక దిబ్బపై మధ్యయుగ కాలం నాటి కోటిలింగేశ్వరాలయం నిర్మాణం చేయబడి ఉంది. కోటలో వెలిసిన లింగం కాబట్టి ఈ ప్రాంతానికి కోటిలింగాలగా పేరు వచ్చినట్లు భావిస్తున్నారు. కోటిలింగాలలో వెలువడిన నాణాలు శాతవాహన రాజులైన చిముక, క్రిష్ణ, మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి, శాతస, మహాతలవర, మహాసేనాధిపతుల కాలం నాటి నాణాలు, పెద్దబొంకూర్, ఇతరత్రా దొరికిన నాణాలు గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్టీపుత్ర పులుమావి, శాతకర్ణి, శివశ్రీ పులుమావి. యజ్ఞశాతకర్ణి, మతారిపుత్ర శాతకర్ణి రాజులకు చెందిన వివరాలు బయటపడ్డాయని నాణాల శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. కోటిలింగాలలో ఏడు పొరల్లో జరిపిన పురావస్తు తవ్వకాలలో వివిధ రాజులకు చెందిన నాణాలతోపాటు,అనేక ఇతర వస్తువులు పూసలు, ఆభరణాలు, కుండపెంకులు, ఇనుప పనిముట్లు తదితర వస్తువులు బయటపడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో 24,345 శాతవాహన నాణాలున్నట్లు, వీటిపై పరిశోధనలు నిర్వహించి గ్రంథస్థం చేసిన ప్రముఖ పురాతత్వ నాణాల శాస్తవ్రేత్త డా.డి.రాజిరెడ్డి ‘ఆంధ్రభూమి’కి వెల్లడించారు. ఈ నాణాలలో కొన్ని పూర్వశాతవాహనులైన మగధ, నంద, వౌర్య, శృంగ, కాణ్వ వంశాలకు చెందినవిగా గుర్తించారు. అలాగే పూర్వ శాతవాహన రాజులైన గోబద, నార్నా, కామవాయస, శ్రీవాయస, సామగోప కాలం నాటి నాణాలను కూడా గుర్తించారు. వీరి కాలంలో ముద్రించిన నాణాలను శాతవాహన రాజులు కూడా కొనసాగించినట్లు విధితమవుతోందని రాజిరెడ్డి పేర్కొన్నారు. శాతవాహన కాలంలోని మహాతలవర, మహాసేనాధిపతి వంటి వారు శాతవాహన భృత్యులుగా, సేనానిలుగా ఈప్రాంతాలను పాలించినట్లు విదితమవుతోంది. అదేవిధంగా కోటిలింగాల సమీప ప్రాంతాలలో ధూళికట్ట, మీర్జంపేట బౌద్దస్థూపాలు, వడుకాపూర్ రాజప్రసాదాలతోపాటు, పెద్దబొంకూర్ లలో శాతవాహన రాజుల గ్రామీణ నాగరికతా అవశేషాలు, నాణాలు పురావస్తు తవ్వకాలలో బయటపడ్డాయి. గుంటూరు జిల్లా అమరావతితోపాటు, మెదక్ జిల్లాలోని కొండాపూర్, మహారాష్టల్రోని పైటాన్‌లలో శాతవాహన స్థావరాలు బయటపడ్డాయి. అలాగే వరంగల్ జిల్లాలోని గీసుకొండలో జరిపిన తవ్వకాలలో ఒక శాతవాహన నాణం బయటపడింది. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో 1952లో క్రీ.పూర్వం 1,2 శతాబ్దిలకు చెందిన వెండి రోమన్ నాణాలు దొరకడంతో శాతవాహనుల కాలంలో జరిగిన విదేశీ వర్తక సంబంధాలు నిర్థారణయ్యాయి. పెద్దబొంకూర్‌లో కూడా రోమన్ నాణాలు లభ్యం కావడాన్ని బట్టి ఇంతవరకు చరిత్రకెక్కని రాజుల వివరాలు మనకు లభ్యమయ్యాయి. ఇక్కడ లభ్యమైన కొన్ని ఆధారాలు నాణాల వివరాలతో సరిపోయాయి. ప్రాక్చరిత్ర కాలం నాటి బృహత్ సమాధులు, రాతి, ఇనుప యుగాల నాటి వస్తువులు ఈప్రాంతాలలో బయటపడడం కోటిలింగాల ప్రాంత ప్రాధాన్యతను పట్టి చూపుతోంది.
బౌద్దచైత్యం ఆనవాళ్ళు:
==============
2009 ఫిబ్రవరి, మార్చిలలో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో మూడవసారి ఒక వ్యవసాయ క్షేత్రంలో జరిగిన పాక్షిక తవ్వకాలలో నాగపలకంతోపాటు, బౌద్దంతో సంబంధం వున్న ఇంతవరకు బయటపడని బౌద్దాచైత్య గృహం బయటపడింది. ఈ చైత్యం రెండు వరసలతో ఇటుక రాళ్ళతో పేర్చబడి వుంది. ఇది తూర్పుముఖంగా గజపుష్పాకారంలో వుంది. ఈ చైత్యం పై నాగఫలకం వుంచేవారని భావిస్తున్నారు. బౌద్దసన్యాసులు నివసించడానికి తగిన గదులు వుండేవని మరింత తవ్వకాలు జరిపితే సమీపంలో ఇవి బయటపడె వీలుందని పురావస్తు అధికారులు అంటున్నారు. ధర్మచక్రం వున్న ఖండిత బుద్దపాదం, నాగశిల్పాలతోపాటు త్రిరత్న ముద్రతో వున్న అత్యంత అరుదైన మట్టికుండ, ఇతర టెర్రకోట వస్తువులు, ఏనుగు చిహ్నం, నంది పాదముద్రలు గల రాగినాణాలు, రంగురంగుల మట్టిపూసలు లభ్యమైయ్యాయి. ట్రాక్టర్లతో దున్నడం వల్ల ఈ ఆనవాళ్ళు దెబ్బతిన్నాయి. కేవలం రెండు లక్షలరూపాయలు కేటాయించి, చేతులు దులుపుకున్నట్లుగా ప్రయివేట్ కాంట్రాక్టర్‌తో ఈ తవ్వకాలు కొనసాగించడం పలువురి విమర్శలకు తావైంది. నిధుల కొరత, సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఈ తవ్వకాలు అర్థాంతరంగా ఆగిపోయాయి.
కోటిలింగాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న ప్రజాసంఘాలు..
==============
కోటిలింగాల కేంద్రంగా దక్షిణాపథాన్ని అజేయంగా ఏలి, ఇక్కడి నుండి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గ్వాలియర్ వరకు ఉత్తర భారతదేశానికి విస్తరించి సాంచి వంటి స్థూపాలను నిర్మించిన శాతవాహనుల పురావస్తు చరిత్ర చిరునామా ఈముంపువల్ల కోల్పోనుంది. ఈ ముంపువల్ల మట్టికింద మహానగరంగా పిలువ బడుతున్న తొలినాటి ఆంధ్రుల సాంఘీక, భాషా, సంస్కృతుల ప్రామాణిక చరిత్రకు నెలవైన కోటిలింగాల పురావస్తు స్థావరం పూర్తిగా తుడిచిపెట్టుకుని, మరుగున పడిపోయే ప్రమాదం వుంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న కోటిలింగాల చరిత్రను వెలికి తీయడం, భావితరాల వారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చరిత్రకారులు వాధిస్తున్నారు. ఎన్నో విశిష్టతలున్న ఈ ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనేకాక, చరిత్రాభిమానం వున్న ప్రతి ఒక్కరిపై వుంది. సింధునాగరికతా వికాస పురావస్తు ప్రాంతాలైన మోహంజాదారో, హరప్పా లుగా చరిత్రకారులచే పిలువ బడుతున్న ఈ కోటిలింగాల గ్రామంలోని పురావస్తుశాఖ గుర్తించిన వంద ఎకరాల ప్రాంతాన్ని పరిరక్షించి, మరింత లోతుగా శాస్ర్తియ అధ్యయనం జరపడం ద్వారా ఇక్కడి మరిన్ని వివరాలను బాహ్య ప్రపంచానికి వెల్లడించాలని, సైట్ మ్యూజియంతోపాటు, టూరిజం కేంద్రంగా అభివృద్ది చేయాలని ఈ ప్రాంత చరిత్రకారులు, వివిధ యూనివర్సిటీల ప్రోఫెసర్లు, కవులు, రచయితలు, మేధావులు, వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థల బాధ్యులు గత ఐదేళ్ళనుండి పెద్దఎత్తున ఉద్యమాలు సాగిస్తున్నారు. తెలంగాణా రచయితల సంఘం, తెలంగాణా విద్యావంతుల వేదిక, తెలంగాణా జాగృతిలాంటి సంస్థలతోపాటు, వివిధ విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కళాకారులు, స్వచ్చంద సంఘాలు కోటిలింగాల పరిరక్షణ వేదికగా ఏర్పడి సంయుక్తంగా పోరాటాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పురావస్తు విభాగంలో కోటిలింగాల శాతవాహన అధ్యయన పరిశోధక ప్రాజెక్టును సుమారు వంద కోట్ల నిధితో ఎర్పాటు చేసి, ఇక్కడి తవ్వకాలలో దొరికిన వివిధ వస్తువులను సేకరించి,సమగ్ర పరిశోధనలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్న డిమాండ్‌తో ఇక్కడి చరిత్రకారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతిలో 2006లో జరిగిన టిబెట్ బౌద్దగురువుదలైలామా, కాలచక్ర ఉత్సవాలకు, అక్కడి బౌద్దప్రాజెక్టు అభివృద్దికి యాబై కోట్లు ఖర్చు చేసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కోటిలింగాల అభివృద్ధి, తవ్వకాలు, పరిశోధనల కోసం నిధులు కేటాయించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మరో నాగార్జున కొండ మ్యూజియం సైట్‌గా తీర్చిదిద్దాలని, సమగ్ర టూరిజం కేంద్రంగా అభివృద్దిపరచాలని కోరుతున్నారు. నాగార్జున కొండలో ఏర్పాటు చేసిన మ్యూజియం తరహాలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టులో కోటిలింగాల ముంపుకు గురికాకుండా ఇక్కడి పురావస్తు అవశేషాలను సేకరించి, పరిశోధించి టూరిజం కేంద్రంగా అభివృద్ధి పరచాలని చరిత్రకారులు కోరుతున్నారు.
నరహరిశాస్ర్తీ కృషితోనే కోటిలింగాల చరిత్ర వెలుగులోకి..
==============
వెల్గటూర్ మండలం కప్పారావుపేటలో 1975 ప్రాంతంలో పోస్టల్ డిపార్టుమెంట్‌లో పనిచేసిన స్వర్గీయ సంగనభట్ల నరహరిశర్మకు సమీప కోటిలింగాల గ్రామానికి చెందిన శాతవాహనుల నాణాలు ఆసక్తిగా సేకరించడంతో కోటిలింగాల చరిత్ర విశ్వవ్యాప్తమైంది. ఇతను కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. నరహరిశర్మ సేకరించిన నాణాలను అప్పటి పురావస్తుశాఖ ఉపసంచాలకులు డా.పివి.పరబ్రహ్మశాస్ర్తీకి ఇవ్వడంతో ఆయన వీటిని పరిశోధించి దేశచరిత్రను మలుపు తిప్పే పూర్వ,తొలి శాతవాహన రాజులకు చెందిన అనేక కొత్త విషయాలను బయటపెట్టారు. ఇంతకాలం శాతవాహన రాజుల తొలి రాజధానిగా అమరావతి ధాన్యకటకమని విశ్వసిస్తున్న చరిత్రకారులకు ఈ కొత్త విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి. క్రీ.పూ. 3వ శతాబ్దంలో భారత దేశంలో పర్యటించిన గ్రీకు రాయబారి మొగస్తనీస్ తాను రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రలో 30 బలిష్టమైన ప్రాకారాలున్న నగరాలు,దుర్గాలున్నాయని, 2వేల గజబలం, 3వేల అశ్విక బలం, లక్ష కాల్బలం వున్నాయని పేర్కొన్నారు. శాతవాహనులను ఆంధ్రభృత్యులుగా భావిస్తున్నారు. ఈ 30 కోటల్లో ఈప్రాంతానికి చెందిన కోటిలింగాల, ధూలికట్ట కోటలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. తరువాత నరహరిశాస్ర్తీ పురావస్తుశాఖలో ఎఫిగ్రపిస్ట్‌గా పనిచేశారు.
అపూర్వం నాణేల పరిశోధనలు:
==============
శాతవాహనులకు చెందిన 284 పూర్ణరాగినాణేలు, 116 విరిగిన రాగినాణేలు కోటిలింగాల తవ్వకాలలో బయటపడినట్లు పురావస్తు నిపుణుల సమాచారం. అంతేకాక రోమన్ రాజులకు చెందిన నాణేలు కుప్పలు కుప్పలుగా బయట పడటంతో శాతవాహన రాజులు గోదావరిని దాటి బంగాళాఖాతం ద్వారా సముద్రంపై రోం, ఐరోపా దేశాలకు వీదేశి వర్తక వ్యాపారాలు ఒడలపై కొనసాగించినట్లు స్పస్టమవుతోంది. ఇక్కడ దొరికిన ఇనుప పనిముట్లను పరిశీలిస్తే, వివిధ రకాల కత్తులు, ఆయుధాల తయారీకి ఉపకరించే ముడి ఇనుము తయారీ కార్ఖానాలు ఈప్రాంతంలో ఉండేవని, ఈ ఆయుధాలను ఇతర దేశాలకు నాడే ఎగుమతి చేసినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఇక్కడ అనేక పంచ్‌మార్క్‌డ్ నాణేలు బయటపడడంతో కోటిలింగాలలో టంకశాల కార్ఖాన వుండేదని భావిస్తున్నారు. ఇటీవల తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడానికి ఇక్కడ దొరికిన రెండు వేల సంవత్సరాల నాటి నాణేల వివరాలు కూడా చారిత్రక ఆధారంగా నిలిచాయి. తవ్వకాలు, పరిశోధనల వల్ల తొలిమానవ వికాసానికి చెందిన అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని పురాతత్వవేత్తలు భావిస్తున్నారు. సుమారు 2500 ఏళ్ల మహోజ్జ్వల చరిత్రను కోటిలింగాల పురావస్తు ప్రాంతం సొంతం చేసుకున్నదని చెప్పవచ్చు. *
===============================
చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి పర్చడం ప్రభుత్వ బాధ్యత
తెలంగాణాలోని ప్రధాన పురాతత్వ స్థావరమైన కోటిలింగాల అభివృద్ది చేసే పనిలో ప్రభుత్వం అలసత్వం చూపిస్తోంది. గోదావరి తీరమైన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం ప్రజాప్రభుత్వాల పని. కోటిలింగాల పరిరక్షణ కమేటి ఉద్యమంగా పరిరక్షణకై కృషి చేయడం ఆనందంగా వుంది. నిజాంను గడగడలాడించిన కొమురం భీం వంటి నాయకులకే గుర్తింపు లేకుండా పోతోంది. అల్లూరికంటే ఆయన తిరుగుబాటు చేశారు. అన్నమాచార్య కీర్తనలకు, అన్నమయ్య కు ఇచ్చిన ప్రాధాన్యం కోటిలింగాలకు ఈసుమంతేనా కల్పిస్తే బాగుండేది. తెలంగాణా చారిత్రిక మ్యాపులో ప్రధాన భూమిక కలిగి వుందనడానికి కోటిలింగాల చారిత్రిక ప్రాంతమే నిదర్శనం.
-ప్రొ.జయశంకర్
================
ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక నాణేలకు సంబంధించినంతవరకు 1978లో కోటిలింగాల తవ్వకాలు ఓ మలుపు. ఇక్కడ రకరకాల నాణేలు లభించాయి. కొన్ని లిపి లేనివి, కొన్ని లిపి వున్నవి, గురుతులు వున్న నాణేలు వీటిలో వున్నాయి. ఇవన్నీ గొబద్, నరన, కామవ్యాయస, సిరివ్యాయస, సామాగోప, చిముక, సతస, సతకర్మి, వశిష్టపుత్ర, పులమవి, శాతకర్ణి తదితర కాలాలకు చెందినవి. శాతవాహనులకు సంబంధించివి మాత్రం ఏవీ లభ్యం కాలేదు. నాణేల్లో రాగి, తగరం తదితర లోహాలతో చేసినవి వున్నాయి. ఆంధ్రప్రాంతంలో గొబద రాజులు తొలిసారి లిపి కలిగిన నాణేలు విడుదల చేసినవారుగా చరిత్రకెక్కారు. ఒక పక్క వివరాలు, రెండో పక్క ఖాళీగా వున్న నాణేలు ఇవి. అక్షరాలు పెద్దవిగా, మోటుగా వుంటాయి. విల్లంబులు, చెట్లు, ఎద్దులలు, కొండలు మొదలైన వాటి చిహ్నాలు వీటిపై వుంటాయి. కోటిలింగాల్లో తొలిసారి 1978లో పరబ్రహ్మశాస్ర్తీ పనిచేసిన కాలంలో పురావస్తుశాఖకు కొన్ని నాణేలు అక్కడి స్థానికుల ద్వారా లభించాయి. ఆ తరువాత డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ అక్కడ తవ్వకాలు చేపట్టారు. అక్కడ లభించిన నాణేల వల్ల, ఇతర ఆధారల వల్ల ఆంధ్రుల చరిత్రకు మరిన్ని వివరాలు లభించినట్లయింది.
-డి.రాజారెడ్డి
====================
అశ్రద్ధ తగదు
తెలంగాణా కేంద్రంగా పురావస్తు స్థావరమైన కోటిలింగాల ను అభివృద్ది పరచడంలో అశ్రద్ద చేయడం తగదు. పురావస్తుశాఖ వారు ఈ ప్రాంతాన్ని రిసర్వే చేయించాలి. శ్రీపాద ప్రాజెక్టు పేరుతో ఈ చారిత్రిక ప్రాంతాన్ని భూస్థాపితం చేయడం తగదు. అవసరమైతే ప్రాజెక్టు ఎత్తున తగించే విషయమై పరిశీలించాలి. దీన్ని ఆపేందులకు జాతి యావత్తు సర్వసన్నద్దం కావాలి. ఈప్రాజెక్టు నిర్మాణానికి తాము ఏ మాత్రం వ్యతిరేకం కాదు. ఈ ప్రాంతాన్ని చరిత్రకారులు, పురావస్తు నిపుణలతో పరిశీలిస్తే ఎన్నో విషయాలు బయటికి వస్తాయి. కోటిలింగాలను నిర్లక్ష్యం చేయడమంటే చరిత్రను విస్మరించడమే. కవులు,రచయితలు, మేధావులు తెలంగాణా రాజకీయ పార్టీల నేతలు ఈ విషయమై ఆలోచించి ఈ కోటిలింగాల ప్రాంతం ముంపునకు గురికాకుండా తగిన చర్యలు తీసుకునేలా వత్తిడి తేవాలి. ఇక్కడ దొరికిన పురాతత్వ వస్తువులతో సైట్ మ్యూజియం ఏర్పాటు చేయాలి. సమున్నత పరిశోధక కేంద్రంగా అభివృద్దిపర్చేందుకు చర్యలు చేపట్టాలి. చరిత్ర ఆనవాళ్లు, సాక్ష్యాలు మాయం కాకముందే పరిశోధకులు, చరిత్రకారులు తమ పరిశోధనలను ప్రారంభించాల్సిన అవసరముంది. ప్రభుత్వంలో కదలిక రావాలంటే తెలంగాణా రచయితలు, మేధావులంతా ఒక్కటై ఉద్యమించేందుకు ముందుకు రావాలి. కోటిలింగాల ప్రాధాన్యం భారత దేశ చరిత్రలోనే ప్రధాన మలుపు. శాతవాహనులకు ముందు తెలంగాణలోని ఆంధ్రాకొట్టాల చరిత్ర తెలుగు జాతికి అంతటికి మూలాధారాలు. వాటిని అధ్యయనం చేయడానికి కోటిలింగాల మొదటి అడుగు.
-ప్రొ. జయధీర్ తిరుమలరావు

ఈ వ్యాసం తెలంగాణ బిడ్డలందరు చదవాలన్న ఉద్దేశంతోనే నా బ్లాగ్ లో ఈ వ్యాసాన్ని పబ్లిష్ చేస్తున్నను. ఇంత మంచి వ్యాసాన్ని అందించిన రచయితలకు నా హృదయపూర్వక కృతఙతలు..

-శ్రీపాద రమణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి