తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

08 ఫిబ్రవరి, 2012

సమ్మక్క - సారలమ్మ చరిత్ర .. ఓ పరిశోధన !


  సమ్మక్క - సారలమ్మ చరిత్ర .. ఓ పరిశోధన !




సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకున్తమనే విషయం అందరికి తెలిసిన.. అసలు సమ్మక్క ఎవరు..? సారలమ్మ ఎవరు? అన్న విషయాల పైన ఒక సందేహం మాత్రం కొనసాగుతున్నది.   ప్రపంచంలోని ఏ దేవుడికైనా సరే అందరూ అంగీకరించే ఓ చరిత్ర ఉంటుంది. ఏ మతాచారానికైనా ఆ మతస్థులంతా నమ్మే ఓ ఆధ్యాత్మిక పునాది ఉంటుంది. ప్రతీ దైవ సన్నిధికి ఓ స్థలపురాణం ఉంటుంది. భూమ్మీది పుట్టి గిట్టిన ఎవరి ఉనికికి సంబంధించైనా కొద్దో గొప్పో చారిత్రక ఆధారం ఉంటుంది. చివరికి ఏ రాజవంశానికి సంబంధించిన జీవనం, యుద్ధాలకు సబంధించి శాసనాలుంటాయి. కానీ అవేమీ లేకున్నా వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఆచారం మేడారం జాతర.
         వరంగల్ జిల్లా మేడారంలో ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర చరిత్ర కారులకు, సాహితీ వేత్తలకు, ఆధ్మాత్మిక పరిశోధకులకు అందని ఓ మిస్టరీ. అంతుచిక్కని సమ్మక్క సారలమ్మ అసలు కథ తెలుసుకోవడానికి కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన గతం ఏంటి అనేది కనీసం భవిష్యత్ లో కూడా తేలే అవకాశాలు కనిపించడం లేదు. కోయగిరిజనులు పాడుకునే పాటల్లో చెప్పుకునే కథల్లో సమ్మక్క సారలమ్మల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది తప్ప ఎక్కడా లిఖిత పూర్వక గ్రంధాలు కానీ, శాసనాలు కానీ లేవు. ఆ కథలు కూడా ఒకదానితో మరొకటి సంబంధం లేనివే. సమ్మక్క మహిమాన్వితురాలనేది కథల్లో, పాటల్లో కోయలు చెప్పుకునే సంగతి. సమ్మక్క సారలమ్మలతో పాటు జంపన్న, నాగులమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు కాకతీయులతో జరిగిన యుద్దంలో నేలకొరిగారనేది ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ. జాతి విముక్తి పోరాటంలో అసువులు బాసారు కాబట్టే జనం వారిని ఆరాధిస్తున్నారనేది ఓ అంచనా. సమ్మక్క సారలమ్మలు పుట్టి పెరిగినట్లు చెపుతున్న కోయ జాతి వంశవృక్షాలను అధ్యయనం చేసిన విద్యార్థులు మాత్రం మహిళలను దేవతలుగా పూజించే సంప్రదాయం కోయల్లో ఉందంటున్నారు. సమ్మక్క సారలమ్మలతో పాటు మరో 23 మంది కోయబిడ్డలు దేవతలుగా పూజలు అందుకునే వారని, మొత్తం 35 తెగలున్నాయని వారందరి చరిత్ర బయటకు వస్తే తప్ప అసలు కథ తెలిసే అవకాశం లేదని రీసర్చి స్కాలర్ సమ్మయ్య చెబుతున్నారు.
         మౌఖిక సాహిత్యం, వాంగ్మయాలను అధ్యయనం చేసిన వారిలో కూడా ఏకాభిప్రాయం లేదు. మధ్య యుగాలకంటే ముందు జానపదులు తమ పాటల్లో, కథల్లో సమ్మక్క ఎవరి బిడ్డా కాదని, కోయ గిరిజనుల కోసం ఆవిర్భవించిన బిడ్డ అని చెప్పుకున్నట్లు కొందరు చెబుతున్నారు. మధ్య యుగాలకు సంబంధించి పరిశోధనలు చేసిన వారు మాత్రం కాకతీయులతో యుద్దం చేసినట్లుగా రాశారు. అయితే వేటికీ చారిత్రక ఆధారం లేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా పొంతన లేనివి. సమ్మక్కకు యోగశక్తి, చికిత్సా శక్తి ఉన్నాయి కాబట్టి ఆమెను దేవత అనుకుని ఉండవచ్చని, ఎవరి గురించి మాట్లాడుకున్నా వారికీ ఓ కుటుంబం ఉంటుందనే అంచనా ఉంటుంది కాబట్టి మిగతా పాత్రలు పుట్టుకొచ్చి ఉంటాయని  యూనివర్సిటీకి  ప్రొఫెసర్లు చెబుతున్నారు.
    బయటి వారి సంగతి సరే, అసలు సమ్మక్క సారలమ్మ వారసులుగా ప్రభుత్వం గుర్తించిన కోయలు  కూడా అసలు విషయం తెలియదనే అంటున్నారు. కాకపోతే వారిని దేవతలుగానే తాము చూస్తున్నామంటున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని మాత్రమే కొనసాగిస్తున్నామని వెల్లడించారు. చందా వంశస్తులకు సంతానం లేకపోవడంతో వారికి దొరికిన బిడ్డ సమ్మక్క అని,  ఆమెకు అన్ని విద్యలూ వచ్చని, ఆమె రాకతో చందా వారింట అంతా మంచి జరిగింది కాబట్టి దేవత అయిందనేది పెద్దల ద్వారా తమకు తెలిసిన చరిత్ర అని సమ్మక్క పూజారి చందా రఘుపతిరావు చెప్పారు.
         మొత్తంగా మేడారం జాతర ఎందుకు జరుగుతుంది?  సమ్మక్క సారలమ్మలను ఎందుకు పూజిస్తారు? రెండేళ్లకోసారే ఎందుకు జరుపుతారు? ప్రతీ ఏటా ఎందుకు జరపరు? అనే విషయాలపై 1996 నుంచి వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు, చరిత్రకారులు పరిశోధన జరుపుతూనే ఉన్నారు. చరిత్రకారులు ఎక్కడ ఏ శాసనం దొరికినా, ఏ చారిత్రక ఆధారం లభించినా అందులో మేడారం, సమ్మక్క ప్రస్తావన ఉంటుందా? అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా జానపద గిరిజన పీఠం అసలు కథను బయటకు తెచ్చే భగీరథ ప్రయత్నం మొదలు పెట్టింది. పరిశోధనను ఇంకా విస్త్రుతం చేసి కొన్నయినా ఆధారాలు సేకరించగమనే నమ్మకాన్ని పీఠం అధ్యాపకుడు గడ్డం వెంకన్న వ్యక్తం చేశారు.
    సమ్మక్క సారలమ్మల చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా విశ్వాసమే జాతరను నడిపిస్తోంది. జాతర జరగడం వల్ల కోయగిరిజన సంస్కృతి బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. కోయల ఆచార వ్యవహారాలకు జాతర ఓ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది. అనేక ఆదివాసీ జాతుల సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతున్నా కోయగిరిజనుల అసలు సిసలు జీవన విధానం ఇంకా మనుగడ సాగించడానికి మేడారం జాతరే కారణమనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు లేవు. అందుకే మేడారం జాతరను హేతువాదులు, నాస్తికులు కూడా గట్టిగా వ్యతిరేకించడం లేదు. చివరికి కమ్యూనిస్టులు, మావోయిస్టులు, ప్రత్యేక తెలంగాణ వాదులు కూడా సమ్మక్క సారలమ్మలను స్పూర్తిగా తీసుకునే పరిస్థితి వచ్చింది.
                                   

2 కామెంట్‌లు:

  1. wonderfull article.. it is very informative and usefull for young research scholars. thank you ramana gaaru.

    రిప్లయితొలగించండి
  2. వెనకటికి ఒకడు ఆకశం వంక చూస్తున్నాడు. అతనికేదొ కనిపిస్తుందని మరొకడు అలా అందరూ ఆకశం వంక చూస్తున్నారట.చివరికి తేలిందేమితి తేలిందేమిటొ మనందరికి తెలిసిందే ! అలనే ఈ సమ్మక్క జాతర కూడానూ.అసలు మూలమేమిటో ఎవరికీ తెలియదు . ప్రక్కవారు నమ్ముతున్నారు నేను కూడ నమ్ముతున్నాను అనేవారే ఎక్కువ .ఏమిటో మరి అంతా మాయ .

    రిప్లయితొలగించండి